ఒకప్పుడు మీడియా ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారిధిగా ఉండేది. కానీ ఇప్పుడు అది కేవలం కులానికో, మతానికో, వర్గానికో, ప్రాంతానికో ప్రతినిధిగా మారింది. దీనికి పెట్టుబడి, కులం, మతం, వర్గం, ప్రాంతం వంటి అవలక్షణాలు ప్రధాన కారణాలు. ఈ కారణాల వల్ల చదువూ సంధ్యలు లేనివాడు.. కనీసం పదో తరగతి చదవని వాడు మీడియాలోకి ఎంటరై జర్నలిస్టు పేరుతో జబర్దస్తీ చేస్తున్నాడు. అక్షరం ముక్క రాయలేని వాడు నేడు జర్నలిస్టు. మీరు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతాన్నైనా తీసుకోండి. హైదరాబాద్, అమరావతి, విజయవాడ, వరంగల్.. ప్రధాన పట్టణాలే కాదు..జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు.. హైదరాబాద్‌లోని సందుసందులో గల్లీ లీడర్లు జర్నలిస్టులుగా చలామణీ అవుతున్నారు. కేవలం వసూళ్ల కోసం, తమ పరపతిని నిలబెట్టుకోవడం జర్నలిస్టులుగా మారుతున్నారు. సమాజాన్ని లూటీ చేస్తున్నారు.
కవరేజీ కాదు కవర్లు
ప్రెస్ మీట్లు, మీడియా సమావేశాలు ముగియగానే, లేదా ఇతరత్రా కవరేజీలు పూర్తి కాకముందే తమకు దక్కే కవర్ల కోసం వెంపర్లాడుతున్నారు. తొలుత మీడియా పేరుతో ఎంటరవుతారు. బేరం కుదరకపోతే వార్తలు రాసి బద్నాం చేస్తామని బెదిరింపులకు దిగుతారు. విలువలు లేని వాడు, అసలు విలువలంటే ఏంటో తెలియని వాడు జర్నలిస్టుగా అవతారమెత్తితే వసూళ్లు తప్ప సమాజానికి ఉపయోగపడే వార్తలు రాస్తాడా? నెవర్!
జీవో 239 ఏం చెబుతోంది?
తెలంగాణ ప్రభుత్వం 2016లో 239 పేరిట జీవో జారీ చేసింది. జర్నలిస్టు అక్రిడిటేషన్ పొందాలంటే మండల విలేకరి పదవ తరగతి, మండల రిపోర్టర్ ఇంటర్మీడియట్, నియోజకవర్గం, జిల్లా, హైదరాబాద్‌లాంటి రాజధానిలో కనీసం డిగ్రీ పాసై ఉండాలని ఖచ్చితమైన నిబంధనలున్నాయి. కానీ ప్రభుత్వం, అక్రిడిటేషన్ జారీ చేసే ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లికేషన్ రిలేషన్స్ డిపార్టుమెంటు సైతం అవేమీ పట్టించుకోకుండా జర్నలిస్టు యూనియన్లకు బెదిరి ఎవరికిపడితే వారికి అక్రిడిటేషన్ కార్డులు జారీ చేశారు.
అసలు అర్హతలు లేవు. అలాంటివాళ్లు మీడియాలోకి వచ్చిందే వసూళ్ల కోసం, పైరవీల కోసం, జబర్దీస్తీ కోసం అలాంటి వాళ్లతో అర్హులు నష్టపోతున్నారు. అక్రిడిటేషన్ కార్డుల జారీ వ్యవస్థనే అబాసలుపాలైంది. ఇదంతా ఒక ఎత్తయితే మీడియా సంస్థల యాజమాన్యాలు అక్రిడిటేషన్ కార్డులు అమ్ముకుంటున్నాయి. ఎవరు ‘కప్పం’ కడితే వారికి అక్రిడిటేషన్ కార్డులు ఇస్తూ ‘సంపాదించుకోండి.. ఆ సంపాదనలో మాకూ కొంత ఇవ్వండి’ అని బేరసారాలు కొనసాగిస్తున్నాయి.
యూట్యూబర్లు జర్నలిస్టులా?
మరోవైపు జీమెయిల్ ఉన్న ప్రతి ఒక్కడూ (మీడియా మీద ఆశ ఉన్నవాడు) వెబ్సైటనో, యూట్యూబ్ అనో స్టార్ట్ చేసి మీడియా ముసుగులో తమ పబ్బం గుడుపుకుంటున్నాడు. మెయిన్ స్ట్రీమ్‌లో రాజకీయాలు, కులం, మతం, వర్గం, ప్రాంతం వంటి వివక్షలను భరించలేక, యాజమాన్యాల టార్చర్ భరించలేక, టాలెంట్ ఉండి, తమవంతుగా సొసైటీకి ఏదో చేద్దామనుకున్నవాళ్లు వెబ్సైట్లు, యూట్యూబులు నడిపితే ఒక అర్థం ఉంటుంది. కానీ ఎలాంటి అర్హతలు లేకుండా, జర్నలిజం అంటే కూడా ఏంటో తెలియని వాళ్లు కూడా నేడు జర్నలిస్టు అనే ట్యాగ్ తగిలించుకొని బయలుదేరారు–దోపిడికీ, వసూళ్లకు.
ఇలాంటి ఫేక్ జర్నలిస్టులకు చెక్ పెట్టాలంటే ప్రభుత్వం, అధికారులు.. మీడియాలో అన్ని అర్హతలున్న వారు మేల్కోవాలి. లేకపోతే ఏదో ఒకరోజు ఇలాంటివాళ్ల వల్ల తమకూ ఎసరొస్తుందనే జ్ఞానోదయం కలగాలి. లేకపోతే వాళ్ల దోపిడి కొనసాగుతూనే ఉంటుంది. అర్హతలున్నవాళ్లు బండ కింద చేతులు పెట్టినవాళ్లలా అలా నలిగిపోతూనే ఉంటారు. ఈ దొంగవల్ల మీడియా గలీజ్ అయ్యిందన్న అపవాదు మూటగట్టుకుంది. ఈ నకిలీగాళ్ల వల్ల ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా ఉండాల్సిన మీడియా మకిలీతో విలవిలలాడుతోంది.
చెడ్డవాళ్ల దోపిడీ కన్నా మంచివాళ్ల మౌనం ప్రమాదకరం!