Caste Family and Conspiracy by KCR family: కులం..కుటుంబం…కుతంత్రం!

కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సహా ఆయన పరివారం అనగా.. కల్వకుంట్ల తారక రామారావు, కల్వకుంట్ల కవిత, తన్నీరు హరీశ్‌రావు, జోగినపల్లి సంతోష్‌రావు… వీళ్లంతా డైరెక్టుగా ఆకాశం నుంచి భూమ్మీదకు ఊడిపడ్డ సర్వశక్తిమంతమైన సంపన్నులు, సర్వాధికారులైన గ్రహంతర వాసులనుకుంటారు. ప్రజల పాలిట భగవత్‌ స్వరూపులమని అనుకుంటారు. ప్రత్యేకించి కేసీఆర్‌, కేటీఆర్‌.. కుటుంబానికి దూరమయ్యేంత వరకు కవిత.. తమనెందుకు ప్రపంచ మేధావుల జాబితాలో ఇంత వరకు ఎందుకు చేర్చలేదో అని మదనపడుతుంటారు. ఈ ఫ్యామిలీకి అధికారం దూరమైనా, ప్రజలు ఎదురు తిరిగినా నిద్ర పట్టదు. అందుకే వాళ్ల నుంచి కుర్చీ లాగి ప్రజలే తప్పు చేశారని దెప్పిపొడుస్తుంటారు. సెప్టెంబర్‌ 3న కవిత మీడియా సమావేశంలో చెప్పిన కొన్ని మాటల ద్వారా వీళ్లు కులం కోసం, కుటుంబ ఆధిపత్యం కోసం ఎంతవరకైనా తెగిస్తారని మరోసారి రుజువైంది. వీళ్లను గద్దెనెక్కించడంలో ఒరిగిన నరకంఠాలలో కొన్ని ఘటనలు, సందర్భాలనూ బేరీజు వేసుకుంటే అర్థమవుతుంది.

అప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెడ్డి, కమ్మ కులాలే రాజ్యాధికారంలో భాగమయ్యాయి. తెలంగాణ ప్రాంతం నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయానికి గురవుతూ వస్తోంది. అదే ఆయుధంగా మారుతోందని వెలమ కులం నుంచి కేసీఆర్‌ అనే ఒక అపర మేధావి గుర్తించాడు. ఆ మూడు నినాదాలతో ప్రజల్లోకెళ్తే స్వామికార్యం, స్వకార్యం నెరవేరుతుందన్నట్లుగా కులం, కుటుంబం బాగుపడేందుకు పక్కా రోడ్‌ మ్యాప్‌ గీసుకున్నాడు. అప్పుడు ఈ ప్రపంచ మేధావికి దళితులు గొర్రెల్లా కనిపించారు. అంతే.. తెలంగాణ రాష్ట్ర సమితి పేరిట పార్టీ ప్రకటించాడో లేదో స్వరాష్ట్రంలో దళితుడే సీఎం అన్నాడు. ఇక ఖతం.. ఆ ఆనందంలో ఆయన అడుగులో అడుగేశారు. డప్పు కొట్టారు. గజ్జె కట్టి ఆడారు.. పాడారు. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు, కవితకు వ్యక్తిగత అంగరక్షకులుగా, బీఆర్‌ఎస్కు కరుడుగట్టిన అభిమానులుగా మారిపోయారు. కేసీఆర్‌కు అంతా అనుకున్నట్టుగా జరుగుతూ వచ్చింది.. మిగతా సమాజం తోడైంది. తెలంగాణ ఉద్యమం నభూతో నభవిష్యత్‌గా జరిగి స్వరాష్ట్రం ఏర్పడింది. దొంగ దీక్షలతో కేసీఆర్‌ హఠాత్తుగా దేవుడైపోయాడు. పార్టీ స్థాపించిన 2001 ఏప్రిల్‌ 27 నుంచి 2014 ఏప్రిల్‌ వరకు దాదాపు 13 ఏళ్లు వేలసార్లు, సందర్భం ఉన్నా.. లేకపోయినా పాడిందే పాట. ‘దళితుడే సీఎం..దళితుడే సీఎం.. కేసీఆర్‌ తలనైనా నరుక్కుంటాడు తప్ప ఇచ్చిన మాట తప్పడు’ అని ఆయనకు ఆయనే సర్టిఫికేట్‌ ఇచ్చుకున్నాడు. ఆయన పాటకు పార్టీ నేతలంతా దరువులేశారు. జూన్‌ 2 సమీపిస్తుండటంతో తన చిరకాల వాంఛను బయటపెట్టి.. ‘కేసీఆర్‌ సీఎం కాకపోతే అమరుల త్యాగాలు, ఎన్నో ఏండ్ల కల వృథా. అన్ని వర్గాల సంక్షేమం దొరతోనే సాధ్యం’ అనే ప్రచారాన్ని ముందుకు తెచ్చి కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టాడు. ఆయన సీఎం కావడంతోనే తల వేల తలలుగా మారి.. వేల తరాలుగా అవమానాలు భరించిన దళిత సమాజానికి తలే లేకుండా చేశాడు. అంతలా అవమానించాడు. అనేది చాలా చిన్నపదం. వేల ఏండ్లుగా అంటరాని వారిగా ముద్ర పడ్డ దళితులు కేసీఆర్‌ మహాశయుడి దెబ్బకు ఆయన్ని నెత్తిన పెట్టుకున్నా అంటరానివారే అయ్యారు. చేసిన తప్పులకూ, ద్రోహాలకూ కేసీఆర్‌ ఇప్పటి వరకు క్షమాపణ చెప్పకపోవడం దొరంహకారానికి నిదర్శనం!

ఆయన, ఆయన కుటుంబ సభ్యులంతా నచ్చిన పదవులు పంచుకొని పరిపాలన కొనసాగించారు. దళితులకు మూడెకరాల భూమి అన్నారు. రాష్ట్రంలో 18 లక్షల కుటుంబాలుండగా 2014 – 2023 అంటే కేసీఆర్‌ హయాంలో కేవలం 6,900 కుటుంబాలకు మాత్రమే ఎకరం నుంచి మూడెకరాల భూ పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. అది కూడా కొందరికే పట్టాలిచ్చారు భూమి చూపించలేదు. కొందరికి భూమి చూపించారు.. పట్టాలివ్వలేదనే ఆరోపణలున్నాయి. ఆ పథకం అట్లా కనుమరుగైంది. భూ పంపిణీ సంగతి అటుంచి ఉన్న పావు ఎకరం, అరెకరం ఉన్న నిరుపేద దళితుల పొట్టగొట్టిన సందర్భాలున్నాయి. రైతు వేదికల కోసం, పార్టీ ఆఫీసుల కోసం దళితుల దగ్గర్నుంచి అన్యాయంగా లాక్కున్న సంఘటనలున్నాయి. 2021లో హుజురాబాద్‌ ఉప ఎన్నిక సందర్భంగా పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు మళ్లీ దళితులే దిక్కయ్యారు. దీంతో మళ్లీ కొత్త పాటందుకున్నాడు. ‘దళితబంధు’ను తెరపైకి తెచ్చాడు. అధికారం, భూమి…పక్కనబెట్టి నేరుగా పైసలతోనే ఆపరేషన్‌ ఆకర్శ్‍కు తెర తీశాడు. కుటుంబానికి రూ.10 లక్షలు ఆర్థికసాయం చేస్తామని ఊదరగొట్టాడు. దేశంలో ఇంత గొప్ప పథకం కానీ.. ప్రపంచంలో ఇంత గొప్ప సీఎం కానీ మరొకరు లేరని మళ్లా ప్రచారం ఊపందుకుంది. తీరా చూస్తే కేసీఆర్‌ అధికారం కోల్పోయేంత వరకు 1500 లోపు కూడా ఈ పథకాన్ని పొందిన లబ్దిదారులు లేరు. రూ.10ల ఆర్థిక సాయం లేదా అంతే మొత్తంలో యూనిట్లను మెజార్టీగా బీఆర్‌ఎస్ కార్యకర్తలకే కట్టబెట్టారు.

ఇవన్నీ ఒకెత్తయితే దళిత ఉద్యమాలను, దళిత న్యాయకత్వాలను జైళ్లల్లోనే అంతమొందించాలనే అత్యంత దుర్మర్గాపు పాలన కొనసాగింది ఆ టైంలో. కేసీఆర్‌ తొమ్మిదేండ్ల పాలన ఉత్తర కొరియా నియంత కిమ్‌ను తలపించింది. ప్రశ్నిస్తే, ఉద్యమిస్తే, హక్కుల గురించి మాట్లాడితే చావు అంచుల దాకా పంపించారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలోని నేరెళ్ల ఘటన. 2017 జూలై 2న జరిగిందా సంఘటన. అప్పటికే మాఫియా పేట్రేగి రాత్రింబవళ్లు ఇసుక దందా చేస్తుంటే.. ఆ లారీల కిందపడి అనేక మంది చనిపోయారు. ఇదేంటని చదువుకున్న దళిత యువకులు ప్రశ్నించిన పాపానికి నేటికీ చస్తూ బతుకుతున్నారు. లాఠీలు, రబ్బరు పైపులతో అర్థరాత్రి నుంచి తెల్లవారే దాకా పోలీసులు వారిపై థర్డ్‍ డిగ్రీ ప్రయోగించారు. ప్రైవేటు పార్టుల్లో బీరు సీసాలు తోశారు. వంతుల వారీగా పదుల కొద్దీ పోలీసులు తీవ్రవాదులను కూడా కొట్టరు. అట్లా కొట్టారు. స్పృహ కోల్పోతే వైద్యం చేసి మరీ చావబాదారు. ఇప్పటికీ ఆ గాయాలు మానలేదు. స్వతహాగా ఏ పనులు చేసుకోలేరు. ఆనాడు ఆ సంఘటన దేశవ్యాప్తంగా చర్చ జరిగినా అప్పటికే కేసీఆర్‌ బలమైన ప్రభుత్వం కావడం చేత విచారణలన్నీ మిన్నకుండిపోయాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అటకెక్కింది. సుద్దపూస నీతులు చెప్పే కేటీఆర్‌ స్వయంగా బాధితులను పరామర్శించి న్యాయం చేస్తానని, బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాడు కానీ ఆ అధికారులకు ప్రమోషన్లు కల్పించి నెత్తినపెట్టుకున్నారు. ఇదీ తండ్రీ కొడుకుల నీతిమంతమైన పాలన!

ఆ పాపం ఎవరిది? కేసీఆర్‌ కుటుంబ సభ్యుడు, రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌రావే సీఎం ఆఫీసు నుంచి ఫోన్లు చేయించి పోలీసులను ఉసిగొల్పాడని, నేరెళ్ల దళితుల ప్రాణాలతో చెలగాటమాడారని కేసీఆర్‌ కూతురు కల్వకుంట్ల కవిత ఇప్పుడు ‘సాక్ష్యం’ చెబుతున్నారు. అది కూడా ఆమెకు ప్రమాదం పొంచి ఉన్నప్పుడు, ఆమె రాజకీయ జీవితం ఆగమైతుందన్న ప్రస్టేషన్‌లో నిజాలు మాట్లాడుతున్నారు. నిజానికి ఆమెది తిరుగులేని సాక్షం. కోర్టులు, హక్కుల కమిషన్లు, చివరికి ప్రభుత్వాలు సుమోటోగా తీసుకున్నా నాటి నిందితులకు కఠినమైన శిక్షలు తప్పవు. అయినప్పటికీ ఆమెది ఎంతటి మోసం! నిజం చెప్పినందుకు అభినందించాలా? సంఘటన జరిగిన ఇన్నాళ్ల దాకా నోరు మెదపనందుకు నిందించాలా? అంటే బాగున్నప్పుడు ఎన్ని ప్రాణాలనైనా పోనీ.. చెడింది కాబట్టి నిజాలు బయటకు వస్తున్నాయి. ఇది ఈ ఆధిపత్య కుటుంబం వరుస. అసలు ఆ కుటుంబం చేసిన దుర్మార్గాలు ఎన్ని ఉన్నాయో? దొరలు కన్నెర్ర చేస్తే కాలగర్భంలో కలిసిపోయిన జీవితాలెన్నో?! అవి కవిత చెబితే బాగుండేది. ఆమెకు క్రెడిబిలిటీ పెరిగేది. కాళేశ్వరం అవినీతి వెనక హరీష్‌రావు, నేరెళ్ల ఘటన వెనక సంతోష్‌ ఉన్నాడని ఆమే చెప్పినందున దర్యాప్తు బృందాలకు సహకరించాలి.

ఇకపోతే కొన్ని పరిణామాలు పరిశీలిస్తే కవిత ఎపిసోడ్‌ అంతా ఒక డ్రామా అనిపిస్తోంది. తన కుటుంబానికి కనుచూపు మేర మళ్లీ అధికారం కల్ల అని కేసీఆర్‌ భావించినట్టున్నాడు. తండ్రీకొడుకుల సిన్మా అయిపోయింది. ఇప్పుడు కూతురు ద్వారా ‘వంశ గౌరవాన్ని’ నిలబెట్టుకునేందుకు ధీర్ఘకాలిక ప్రణాళిక రచించినట్లున్నాడు. వచ్చే ఎన్నికల సమయానికి చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఖచ్చితంగా పార్టీలన్నీ 33శాతం సీట్లు మహిళలకే కేటాయించాలి. ఆ అవకాశాల దృష్ట్యా మళ్లీ తెలంగాణ మహిళా చైతన్యానికి కవితను దిక్కు చేసేందుకు కేసీఆర్‌ వేసిన స్కెచ్‌ అనిపిస్తోంది. అధికారం కోసం అప్పుడు దళితులు.. ఇప్పుడు మహిళలన్నమాట. అందుకే అత్యంత వ్యూహాత్మకంగా కవితా బాణాన్ని వదిలినట్టున్నాడు. ఇదంతా కాకపోయినా కవిత స్వతహాగా బయటకు వచ్చినా కేవలం..కేవలం.. ఆమె అధికారం కోసమేనని మాత్రమే అనుమానించాలి. ఎందుకంటే నిజామాబాద్‌ ఎంపీగా ఓడిపోతే పార్టీలో మరింకే మహిళ లేనట్టు ఈమే ఎమ్మెల్సీ అయ్యారు. కుర్చీ లేకపోతే ఆ కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుందో చెప్పేందుకు ఇదే ఉదాహరణ. కేసీఆర్‌ నుంచే తాను సామాజిక న్యాయం గురించి నేర్చుకున్నానంటున్నారు కవిత. దళిత సీఎం హామీ, మూడెకరాల పంపిణీ, దళిత బంధు.. ఏవీ పరిపూర్ణంగా నెరవేర్చకపోవడమేనా కేసీఆర్‌ సామాజిక న్యాయ సిద్ధాంతం.

కవిత సంఘం పెట్టినా.. పార్టీ పెట్టినా.. మరో పార్టీలో చేరినా ఏదో ఒక రోజు మళ్లీ గులాబీ గూటికి చేరే పక్షే. ఎందుకంటే ఆమె ‘కేసీఆర్‌ బిడ్డ’. రూపంలోనూ.. ఆలోచనలోనూ.. ఆచరణలోనూ అంతా సేమ్‌ టు సేమ్‌. ఆమె చెప్పే సామాజిక న్యాయం కూడా అంతే. ఇంటి నుంచి ‘అవకాశాల పిలుపు’ వచ్చే దాకా బీసీలు, దళితులు, గిరిజనులు.. సమస్త మహిళా ప్రజానీకమే ఆమె లోకం. ఆమె అవసరాలు అట్లా ఉంటే.. ఆమె వెంట నడిచే వారి అవసరాలు, అవకాశాలు చాలా చిన్నవి. అయినా, వాటి కోసం వారికీ ‘జై కవితక్క’ నినాదం తప్పదు. అయ్యా, అన్నా..అయిపోయింది.. ఇప్పుడు అక్కను భుజాన మోయాల్సిందే.

ఇక అధికారంలోకి వస్తే నేరెళ్ల ఘటనపై విచారణ జరిపించి, బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి మరిచిపోయిన రేవంత్‌ రెడ్డి చర్యలకు పూనుకోవాలి. నిజానికి కాళేశ్వరంతో పాటు నేరెళ్ల ఘటనపై కూడా సీబీఐ విచారణ జరిపిస్తే దాని వెనుక కేసీఆర్‌, కేటీఆర్‌, సంతోష్‌రావు.. ఎవరున్నారో బయటకొస్తుంది. తద్వారా దోషులకు శిక్షలు పడి బాధితులకు న్యాయం జరుగుతుంది. అందువల్ల రేవంత్‌ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. దీని వల్ల తనకూ, తన పార్టీకే మైలేజీ వస్తుంది. దాని కోసమైనా కాంగ్రెస్ సర్కార్‌ ధర్మం వైపు నిలబడాలి!

– మహేష్‌ కొంగర
సీనియర్‌ జర్నలిస్ట్

(తెలుగుప్రభ సౌజన్యంతో)

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com