తెలంగాణ రాకముందు…అంతెందుకు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా ఆంధ్రా ఆధిపత్యవర్గాల చేతల్లో బందీ అయిన సినిమాల్లో ‘తెలంగాణ’అవహేళనకు గురైంది. తెలంగాణ యాస, భాషలు విలన్ క్యారెక్టర్లు, కామెడీ పాత్రలకు పరిమితమయ్యేవి. అది గతం. మరి వర్తమానం..ఇప్పుడు తెలంగాణ లేకుండా తెలుగు సినిమా అనేది దాదాపు ఉండటం లేదు. తెలంగాణే హీరో. తెలంగాణే కథ. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలే కథా వస్తువులు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పడితే ఏమోస్తుంది అనే వాళ్లకు ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. నిజానికి తెలుగు సినిమాలో ‘తెలంగాణ’ దేశానికి స్వాతంత్ర్యం రాకముందు నుంచే ఉన్నది. కానీ ఆశ్చర్యకరంగా కనుమరుగైంది. హైదరాబాద్ స్టేట్లో, నిజాం ఏలుబడిలో వారి ప్రోత్సాహంతో మూకీ సినిమాల నిర్మాణం, ప్రదర్శన, థియేటర్లు సైతం ఏర్పాటయ్యాయి. బెంగాల్‌కు చెందిన ధీరేంద్రనాథ్ గంగూలీ అనే వ్యక్తి 1920లలో హైదరాబాద్‌లో ప్రత్యేక థియేటర్లను ఏర్పాటు చేసి సినిమాలను ప్రదర్శించడంతోపాటు ‘లోటస్ ఫిలిం కంపెనీ’పేరుతో ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించినట్లు చరిత్ర చెబుతోంది. అంతేకాదు తెలంగాణకు చెందిన పైడి జయరాజ్ 300కు పైగా బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాల్లో నటించారు. తెలంగాణకు చెందిన నటీనటులు, టెక్నీషియన్ల సేవలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగు సినిమాల్లోనూ ఉన్నాయి. కానీ అడుగున ఎక్కడో మూలన కనిపించి, కనిపించనట్లుగా ఉన్నాయి. కాంతారావు లాంటి సీనియర్ నటులు సినిమా రంగానికి ఎంతో సేవ చేశారు. అయినా సరైన గుర్తింపు లభించలేదు.
పెత్తందార్లపరం
రెండున్నర కులాలు, రెండున్నర జిల్లాలుగా పేరు మోసిన ఆంధ్రాపెట్టుబడిదారులు, ఆంధ్రా ఆధిపత్య కులాల (ఆధిపత్య కులాలకు చెందిన కొందరు ప్రజాస్వామిక వాదులకు మినహాయింపు)ల చేతిలో తెలుగు సినిమా నలిగిపోయింది. మిగతా రంగాల్లో డామినేషన్, వివక్ష ఒకలా ఉంటే సినిమా రంగంలో మరోలా ఉంటుంది. తెలంగాణవాడు కనిపిస్తే కనిపిస్తే ఆఫీస్ భాయ్‌లుగా నియమించుకోలేని విష సంస్కృతి ఉన్న రోజులున్నాయి. తెలంగాణకు చెందిన వారు సైతం ఆంధ్రా ముసుగేసుకొని, ఆ యాసలో బతికిన వారున్నారు. అందుకే తెలంగాణ భాష, యాసలు, కల్చర్ ఆ పెత్తందారీ పోకడలో కనుమరుగైంది. అవహేళనకు గురైంది. ఇప్పుడు స్వరాష్ట్రంలో తెలంగాణ యాసలు, తెలంగాణ భాషతో కథలపై ప్రొడక్షన్ హౌస్‌లు, సినీ హీరోలు ఆసక్తి కనబరుస్తున్నారు. మిగతా ప్రాంతాల్లాగే తెలంగాణకు ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. పోరాట స్వభావమున్నది. అవి పరాయి ఫిల్మ్ మేకర్లకు నచ్చలేదు. అందుకే అవి కథలుగా రాలేదు.
మా భూమి నుంచి బలగం దాకా
1979-80లలో వచ్చి మా భూమి, దాసివంటి సినిమాలు తెలంగాణ నేపథ్యంలో, తెలంగాణ భాషతో వచ్చినవే. ఆ తర్వాత వచ్చిన ఒసేయ్ రాములమ్మ (1997) వంటి విప్లవ సినిమాల్లో లీడ్ కారెక్టర్లకు తెలంగాణ యాసను పెట్టి కొంత వరకు సక్సెస్ అయ్యారు. నిజానికి అప్పట్లో అలాంటి ప్రయోగాలు సాహసమే. సినిమాల్లో జైబోలో తెలంగాణ (2011) , పోరు తెలంగాణ, వీర తెలంగాణ వంటి సినిమాలు ‘తెలంగాణ’ను ఏదో థీమ్‌తో వెండితెరను తాకాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు వరకు ఆంధ్ర ఫిల్మ్ మేకర్లు, ఆంధ్రా యాక్టర్లే తెలంగాణ కథలతో సినిమాలు తీసేవారు. వాటిల్లో చాలా వరకు కృతకంగా ఉండేది. కేవలం వ్యాపారకోణంలో అక్కడక్కడ తెలంగాణ అంశాన్ని టచ్ చేసేవారు. ఇప్పుట్లా కాదు తెలంగాణ కవులు, కళకారులు, రచయితలు, హీరో, హీరోయిన్లు, ఇతర నటీనటులు నిర్మాతలు, దర్శకులు..ఇతర సాంకేతిక సిబ్బంది…పేరు చెప్పండి సంబంధిత క్రాఫ్ట్‌లో ఆరితేరినవారు వందలాదిమంది క్యూ కడతారు. అంటే తెలంగాణలో టాలెంట్‌కు కొదువ లేదు. అవకాశం ఉండాలే ఆకాశమే హద్దుగా వీళ్లు తమ ప్రతిభా పాటావాలను నిరూపించుకుంటారు. అలాంటివాటిల్లో పెళ్లిచూపులు (2016), ఫిదా (2017), మల్లేశం (2019), దొరసాని (2019), జాతిరత్నాలు (2021), విరాటపర్వం (2022), బలగం (2023), దసరా (2023) మొదలైనవి కొన్ని. ఇందులో ఫిదా మూవీ తెలంగాణకు చెందిన దిల్ రాజు నిర్మించారు తప్ప.. నటీనటులు మెజార్టీగా ఇతర ప్రాంతాలకు చెందినవాళ్లు. ఫిల్మ్ మేకర్లు తరుణ్ భాస్కర్, కేవీ అనుదీప్, వేణు ఉడుగుల, కేవీ మహేంద్ర, శ్రీకాంత్ ఓదెల, వేణు యెల్దండి, సాహిత్ మోత్కురి (పొట్టేల్ ఫేం) వంటి ఎందరో యువ దర్శకులు, రచయితలు తెలుగు తెరకు పరిచమయ్యారు. అనేక మంది ఇతర సాంకేతిక నిపుణులు తమ సత్తా చాటుతున్నారు. కొత్తపోరడు (2021), హాష్ ట్యాగ్ నైంటీస్ (2024) వంటి వెబ్‌సీరిస్‌లు సైతం తెలంగాణ నేపథ్యంలో ఓటీటీలలో రిలీజై ఆశేష ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక య్యూటూబ్‌లోనైతే తెలంగాణ తీన్‌మార్ ఆడుతోంది. బత్తిరి సత్తి, గంగవ్వ, సుజాత, చంద్రవ్వ, మంగ్లీ, దేత్తడి హారిక, చమ్మక్ చంద్ర వంటి అనేక మంది తమ టాలెంట్‌ను ప్రదర్శిస్తూ వెండితెరకు ఎంట్రీలా వినియోగించుకుంటున్నారు. తెలంగాణ నేపథ్యంలో వచ్చే ఫోక్ సాంగ్స్ సినిమాలు దీటుగా ఉంటున్నాయి. ఇది తెలంగాణ టాలెంట్!
ప్రోత్సాహం అవసరం
తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ చొరవతో రవీంద్రభారతిలో పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ ఏర్పాటు చేసిన యువ ఫిల్మ్ మేకర్లు, టెక్నీషియన్లను ప్రోత్సహిస్తున్నారు. ప్రతి శనివారం ‘సినివారం’పేరిట యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్నారు. షార్ట్స్ ఫిల్మ్స్‌ను ఉచితంగా ప్రదర్శించడమేకాకుండా టీంతో డిబేట్లు ఏర్పాటు చేయడం, నటన, కథ, స్క్రీన్ ప్లేలపై వర్క్‌షాపులు నిర్వహిస్తూ తెలుగు వెండితెరకు పరిచయం చేసేలా తనవంతుగా కృషి చేస్తున్నారు. అయితే ఇది అభినందనీయమే అయినా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అన్ని రంగాల్లో కొంతమేర అభివృద్ధి చెందుతున్నట్లుగా కనిపిస్తున్నా సినిమా రంగం మాత్రం ఇంకా వెనకబడే ఉన్నది. తెలంగాణ ఫిల్మ్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.100 కోట్లు కేటాయిస్తామన్నారు. అది ఇంత వరకు ఆచరణకు నోచుకోలేదు. పక్క రాష్ట్రాల్లో చిన్న సినిమాలకు అందిస్తున్నట్లుగా ప్రోత్సాహాకాలు, రాయితీలు తెలంగాణలోనూ అమలు చేయాలి. తెలంగాణ చారిత్రక వారసత్వ సంపద, కట్టడాలు, ఇతర లొకేషన్లలో షూటింగులు చేసుకునేందుకు ఆ థీమ్‌లతో కథలు వస్తే ప్రోత్సహించాలి. పకడ్బందీ పాలసీ ప్రకటించి తెలంగాణ సినిమాను మరింతగా అభివృద్ధిపరచుకోవాలి. ఈ క్రమంలో అదే కులం, ప్రాంతం, నావాడు అన్న ఆశ్రిత పక్షపాతాలు చూపిస్తే మళ్లీ పాత రోజులే వస్తాయి.
ఆ మూస ధోరణి మారాలి
ఇప్పటి దాకా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొందరి చెప్పు చేతల్లోనే ఉంది. ఆ ధోరణి తెలంగాణలో ఉండకూడదు. టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదని అందరూ మాట్లాడుతుంటారు. కానీ అదే టాలెంట్‌తో మారుమూల తెలంగాణ ప్రాంతం నుంచి (కొన్నిసార్లు ఆంధ్రా, రాయలసీమల నుంచి) వచ్చినా బ్యాక్‌గ్రౌండ్ లేదన్న కారణంగా, రికమండేషన్ లేని కారణంగా వాళ్లు ఆస్కార్‌లాంటి కథలు చెప్పినా పట్టించుకోరు. అదే కులమేనే దరిద్రం మెడకు చుట్టుకొని వస్తే, ప్రాంతాన్ని ప్యాకెట్లో వేసుకొని వస్తే అది మోస్ట్ డిజాస్టర్ కథయినా నెత్తిన పెట్టుకుంటారు. ఇట్లా వివక్షలు చూపించి, చేతులు కాల్చుకున్న ప్రొడ్యూసర్లు, యాక్టర్లున్నారు.
నిజాం ఏరియా (తెలంగాణ) నుంచి 30-40శాతం తెలుగు సినిమాకు రెవెన్యూ వస్తుంది. ఏటా అత్యధికంగా సినిమాలు నిర్మిస్తూ, రిలీజ్ చేస్తున్నది టాలీవుడే. ఏటా దాదాపు 200 సినిమాలు ఇక్కడ రిలీజవుతున్నాయని ఒక అంచనా. తెలుగు సినిమా అంటే తెలంగాణ సినిమా కూడా. డిజిటల్ యుగంలో సినిమాలు తెరమీదనే కాదు ఓటీటీలలో కూడా రిలీజవుతూ విషయం ఉంటే సదరు టీంను ఎక్కడికో తీసుకెళ్తున్నాయి. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఐఏ) విప్లవం దూసుకొచ్చేసింది. సినిమాల్లో దాని వినియోగం పెరిగింది. ఆ దిశగా ఇక్కడి టెక్నీషియన్లకు శిక్షణ ఇప్పించడం వంటి చర్యలు చేపడితే పోటీ ప్రపంచంలో తెలంగాణ సినిమా నిలబడగలుగుతుంది.
తెలంగాణ ఉద్యమం కేవలం నీళ్లు, నిధులు, నియామకాలు మాత్రమే కాదు స్వయంపాలన, ఆత్మగౌరవం, అభివృద్ధి కూడా. ఆ అభివృద్ధి అన్ని రంగాల్లో సమానంగా జరిగాలి. అందులో అన్ని వర్గాలకు సముచిత స్థానం ఉండాలి. అప్పుడే సాధించుకున్న తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణగా, సామాజిక తెలంగాణగా పరిఢవిల్లుతుంది.