కుంగిపోతున్న ఆ రెండు స్తంభాలు

Representational Image : chatgpt

పార్లమెంటరీ వ్యవస్థకు శాసన, న్యాయ, కార్యనిర్వహక వ్యవస్థలు మూడు స్తంభాలుగా వెలుగొందుతుంటే మీడియా నాలుగో స్తంభంగా విరాజిల్లుతోంది. అయితే.. విచిత్రంగా, ప్రమాదకరంగా శాసన వ్యవస్థ(చట్టసభలు)కు, మీడియాకు విద్యార్హతలు లేవు. భారత రాజ్యాంగంలోని అధికరణలు 84, 102, 173, 191తో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లో పార్లమెంటరీ ఎన్నికల్లో పాల్గొనేందుకు పలు అర్హతలు, అనర్హతలు పొందుపరిచారు. భారత పౌరులై, ఓటరుగా నమోదు చేసుకొని, లోక్‌సభ, అసెంబ్లీలకు పోటీ చేసే వ్యక్తులు 25 ఏళ్లు.. రాజ్యసభ, మండలికి పోటీ చేసే వ్యక్తులు 30 ఏళ్లు నిండితే చాలు. వీటితో పాటు మరికొన్ని ఇతర అర్హతలు, అనర్హతలు పేర్కొన్నారు. కానీ, విద్యార్హతలు మాత్రం ఎక్కడా చెప్పలేదు. దీంతో నిరక్షరాస్యులు సైతం ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చట్టసభల్లో చలామణి అవుతూ వస్తున్నారు. వీరిలో నిస్వార్థ సేవ సంగతి పక్కన పెడితే.. నిరక్షరాస్యత వల్ల అధికార దుర్వినియోగాలే ఎక్కువగా జరిగాయి. ప్రస్తుత లోక్‌సభలో 543 ఎంపీలలో 105 మంది(19 శాతం) తమ విద్యార్హతలు వెల్లడించగా.. అందులో పదో తరగతి వరకు చదివినవారు 34 మంది, ఇంటర్మీడియట్ పూర్తి చేసినవారు 65 మంది, పోస్టుగ్రాడ్యుయేట్లు 147 మంది, గ్రాడ్యుయేట్లు 147 మంది, ప్రొఫెషనల్ కోర్సులు చదివినవారు 98 మంది, ఒక్కరు నిరక్షరాస్యులుగా ఉన్నారని అసోషియేషన్ ఆఫ్ డెమెక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) వెల్లడించింది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికయ్యే సభ్యుల పరిస్థితి కూడా ఇలానే ఉంది. అటు స్థానిక సంస్థలైన జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికవుతున్న వారిలో విద్యావంతులను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. అంటే నిరక్షరాస్యులే స్థానిక సంస్థల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నిరక్ష్యరాస్యులతో ఒక దేశం మనుగడ సాగించడం ఆందోళనకరమే. చట్టసభల సభ్యులకు విద్యార్హతలు ఎందుకు ఉండకూడదన్న దానిపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై అత్యున్నత న్యాయస్థానాలు పార్లమెంటుదే నిర్ణయమని చెబుతున్నాయి తప్ప చట్టమెందుకు చేయడం లేదని అడగడం లేదు.

జర్నలిస్టులకు విద్యార్హత వద్దా?


ఇక మీడియా విషయనికి వస్తే.. గవర్నమెంటులోని వివిధ డిపార్టుమెంట్లలో పని చేసే చిన్నస్థాయి ఎంప్లాయీస్ అటెండర్, క్లర్క్, వాచ్‌మన్, సెక్యూరిటీ గార్డు.. ఇలా ఎవరిని తీసుకున్నా వారికి తగు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నిర్ణయించి దాని ఆధారంగా పరీక్షలు, ఇతరత్రా టెస్టులు చేసి.. అందులో ‘ది బెస్ట్’ అని నిర్ధారించుకున్నాకే సంబంధిత కొలువుకు ఎంపిక చేస్తారు. అంత కిందస్థాయి కొలువులకే సవాలక్ష కండిషన్లు పెట్టి భర్తీ చేస్తే.. మరి ఉదయం లేచినప్పుటి నుంచి పొద్దుపోయే వరకు నిత్యం సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెలికితీస్తూ.. ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధుల్లా ఉండే జర్నలిస్టు(విలేకర్లు, రిపోర్టర్లు)లకు విద్యార్హతలు ఉండొద్దా? అహోరాత్రులు కష్టపడి, ఎన్నో కోచింగులు తీసుకొని సివిల్స్ సర్వీసులు, గ్రూప్–1, గ్రూప్–2 ఇతర ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన అధికారులను ప్రశ్నించడానికి, వారి నుంచి సరైన సమాచారం రాబట్టడానికి, ఒకవేళ వారు అవినీతి, అక్రమాలకు పాల్పడితే నిలదీయడానికి మీడియా ఎంప్లాయీస్‌కి కనీస క్వాలిఫికేషన్ అవసరం లేదా? అసలు మీడియా అంటే అదేదో బ్రహ్మ పదార్థమని, ఆకాశం నుంచి ఊడిపడ్డ శకలమని ఎందుకు అనవసర మర్యాదలు? సమాజంలో మీడియా అంతర్భాగమని ఎందుకు మరిచిపోతున్నారు? భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 19 (1)(ఏ) ప్రకారమే పౌరులకున్న భావ ప్రకటనా స్వేచ్ఛ ఆధారంగానే మీడియా కొనసాగుతుందన్న ఎరుక ఎందుకు విస్మరిస్తున్నారు? ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా.. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా విస్తృతిలో ఐదో స్తంభంగా వెలుగొందుతున్న మీడియా ప్రక్షాళనకు ఎందుకు పూనుకోవడం లేదు? మీడియాపైన, మీడియా ప్రతినిధులపైన ఫిర్యాదులు వస్తే జాతీయస్థాయిలో ఉన్నట్లు ‘ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ వంటి సంస్థలు రాష్ట్రాల్లో ఉత్సవ విగ్రహలుగానే ఉన్నాయి.

స్వీయ నియంత్రణ ఏది?


హైదరాబాద్‌తో పాటు సిటీలోని జోన్ల నుంచి మొదలుకొంటే జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో వందలాది మంది వివిధ వార్తాపత్రికలు, టీవీ ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్లు, వెబ్‌సైట్లు, ఈ–పేపర్ల ప్రతినిధులమంటూ రిపోర్టర్లుగా జనం మీద, ప్రభుత్వ అధికారుల మీద, ప్రైవేటు సంస్థల మీద ‘లైసెన్సుడ్’ లైజనింగ్ చేస్తున్నారు. అవినీతి అక్రమాలను వెలికి తీయడం, ప్రభుత్వ అధికారులను ప్రజలకు జవాబుదారీగా చేయడం, సమాచారంతో నిరంతరం ప్రజలను చైతన్యం చేయడమే మీడియా ప్రధాన విధి. ప్రధాన పత్రికలు, టీవీ ఛానళ్లు మండల, నియోజకవర్గాలకు తప్ప హెడ్ ఆఫీసుల్లో వివిధ హోదాల్లో పని చేసేందుకు రాతపరీక్షలు పెట్టి, అవసరమైతే శిక్షణ ఇచ్చి జర్నలిస్టులుగా తీర్చిదిద్దుతున్నాయి. నియోజకవర్గాలు, మండలకేంద్రాల్లో పని చేసేవారికి కొన్ని మీడియా సంస్థలు ఎలా రాయాలి? ఏం రాయాలి అనే అంశాలపై అప్పుడప్పుడు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాయి. వీటిల్లో స్థానికంగా పనిచేసే వారికి విద్యార్హతలు పెద్దగా లేకపోయినా సంస్థలిచ్చే ట్రైనింగ్ వల్ల కాస్త డిగ్నిఫైడ్‌గా ఉంటున్నారు. మిగతా ఊరూ, పేరూ లేని సంస్థలు, పత్రికలు, ఛానళ్లు, ఈ-పేపర్లు, వాట్సాప్‌ పత్రికలు, అందులో రిపోర్టర్లుగా పనిచేసే వారికి కనీసం పదో తరగతి కూడా అర్హత లేదంటే అతిశయోక్తి కాదు. కొన్నింటికైతే అతడే సీఈవో, అతడే చీఫ్ ఎడిటర్, అతడే రిపోర్టర్..ఇదీ నేడు తెలుగు రాష్ట్రాల్లో మీడియా పరిస్థితి. అరకొర చదువులతో కంట్రిబ్యూటర్లుగా, స్ట్రింగర్లు ఒకపక్క, నకిలీ జర్నలిస్టులు మరోపక్క, అసలే అర్హతలు లేకుండా మీడియా ప్రతినిధులుగా చెలామణీ అవుతున్నవారు ఇంకోపక్క చెలరేగి చేస్తోన్న జబర్దస్తీ అంతాఇంతా కాదు. మరీ ముఖ్యంగా కరోనా కాలం నుంచి ‘వాట్సాప్’ పత్రికలు, యూట్యూబ్ జర్నలిస్టులు ఎక్కువయ్యారు. ఇందులో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పని చేసి అక్కడి వేధింపులు భరించలేక, మరింత స్వేచ్ఛ కోసం అర్హత కలిగిన జర్నలిస్టులు ఉన్నారు. ఇలాంటి వారిని మినహాయిస్తే మిగతా వారు జీమెయిల్ ఉంటే చాలు మీడియాను నడుపుతున్నారు. తెలుగునాట అన్ని ప్రాంతాల్లో కులం, వర్గం, ప్రాంతాలను బట్టి జర్నలిస్టు సంఘాలు కొనసాగుతున్నాయి.

అక్రిడిటేషన్లు అభాసుపాలు


రాష్ట్రవ్యాప్తంగా చాలామంది పేపర్ ఏజెంట్లు, మీడియాలో పైస్థాయిలో పనిచేసే వారి సన్నిహితులు, పని మనుషులు సైతం అక్రిడిటేషన్లు పొందుతున్నారంటే పరిస్థితి ఎంతలా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే, గట్టిగా నాలుగు అక్షరాలు కూడా రాయలేనివారు జర్నలిస్టు సంఘాలను నడుపుతున్నారు. ఈ స్థితికి బాధ్యులెవరూ? మీడియా యాజమాన్యాలకన్నా నియంత్రణ కలిగి ఉండే ప్రభుత్వాలే ఈ బహిరంగ రహస్య మాఫియాను అరికట్టాలి. రాష్ట్రంలో మీడియా అదుపు తప్పకుండా ఉండేందుకు అంబుడ్స్‌మన్ వ్యవస్థ, మీడియా అవినీతి, మీడియా పేరుతో జరిగే అక్రమాలను కట్టడి చేసేందుకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. లేకపోతే యావత్ సమాజం మూల్యం చెల్లించుకోక తప్పదు. జర్నలిజాన్ని పవిత్ర వృత్తిగా స్వీకరించి నికార్సయిన జర్నలిస్టులున్నారు. చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని పోషించలేక అవస్థలు పడుతున్నవారున్నారు. దేనికీ వెరవక నిజాలను వెలికితీస్తూ నిరంతరం రాజ్యం, మాఫియా నుంచి ప్రమాదాలు మోస్తోన్న కలం యోధులూ ఉన్నారు. అట్లాంటివారికి ప్రభుత్వం అండగా నిలవాలి.

నిజానికి ఏ కంపెనీ ప్రారంభించాలన్నా పెట్టుబడి కావాలి. అంటే డబ్బు ఎవరు పెడతారో వారే యజమానులు. యజమాని తాను స్థాపించే కంపెనీ ప్రొడక్టులకు సంబంధించిన అర్హత కలిగి ఉండాల్సిన పని లేదు. కానీ అందులో పని చేసేవారు మాత్రం కంపెనీ ప్రొడక్టు తయారీలో, వివిధ స్థాయిల్లో పని చేయాలంటే సంబంధిత అనుభవం, అర్హత ఉండాల్సిందే. ఇందుకు మీడియాకు సైతం ఎలాంటి మినహాయింపు లేదు. అంటే మీడియా (పత్రికలు, ఛానళ్లు, ఇంటర్నెట్ ఆధారంగా నడిచే ఛానళ్లు, వెబ్‌సైట్లు)లో పని చేసేవారికి తాము నిర్వర్తించే బాధ్యతలకు తగిన అనుభవం, అర్హత అవసరం. ఇంటర్నెట్ ఆధారిత సోషల్ మీడియా, న్యూమీడియానూ డెమోక్రసీకి ఐదో స్తంభంగా అభివర్ణిస్తున్నారు. అంతటి విలువ, ప్రాధాన్యమున్న మీడియా ప్రతినిధులకు తగు అర్హతలు లేకపోతే వ్యవస్థనూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యానికి గురి చేస్తున్నట్టే కదా. “అన్నింటి గురించి కొంత, కొన్నింటి గురించి ఉన్నదంతా జర్నలిస్టుకు తెలిసి ఉండాలి” అని జర్నలిజంలో పాఠాలుగా చెబుతారు. మరి నిజంగా ఇప్పుడు జర్నలిస్టులుగా చలామణీ అవుతున్న వారికి అన్నింటి గురించి దేవుడెరుగు కొన్నింటికి గురించైనా ఆ కొన్నింటిలో కొంతైనా తెలుసా అంటే డౌటే? చదువు సంధ్యలు లేనివారు మీడియా ప్రతినిధులుగా అవతారమెత్తినపుడు అలాంటివే కాదు 5Ws (What, When, Where, Who, Why), 1H (How)లు ఆశించడమూ అత్యాశే! బీటలువారిన ప్రజాస్వామ్యపు నాలుగో స్తంభాన్ని రక్షించేదెవరో?!

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com